-
-
By Chowdary
Updated :
20 November 2025 10:28 AM
హైదరాబాద్: హెటెరో కంపెనీ రహస్య డేటా లీక్ చేస్తామని, సున్నితమైన సమాచారాన్ని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యూఎస్ఎఫ్డీఏ)కు ఇస్తామని బెదిరించిన వ్యవహారంలో సైబరాబాద్ పోలీసులు ఇద్దర్ని అరెస్టు చేశారు. సైబర్‌క్రైమ్ డీసీపీ సాయిశ్రీ బుధవారం కేసు వివరాలు వెల్లడించారు. హెటెరో సంస్థ సీనియర్ ఉద్యోగికి మారుపేర్లతో వేర్వేరు ఐడీల నుంచి రెండు వారాలపాటు వరుసగా ఈమెయిళ్లు వచ్చాయి. కంపెనీ కార్యకలాపాలు, నిర్వహణకు సంబంధించి సున్నిత, సంస్థకు నష్టం కలిగించే సమాచారం తమ వద్ద ఉందని.. బయట పెట్టకుండా ఉండాలంటే రూ.2 వేల కోట్లు (250 మిలియన్ డాలర్లు) ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. అవసరమైతే యూఎస్ఎఫ్డీఏని కూడా ప్రభావితం చేయగలమని దుండగులు మెయిళ్లలో పేర్కొన్నారు.
సంస్థ ప్రతిష్ఠ దిగజార్చేందుకు ఉద్దేశపూర్వకంగా ఇలా బెదిరింపులకు దిగారని హెచ్ఆర్ ఉపాధ్యక్షుడు జైపాల్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈమెయిళ్ల ఆధారంగా గడి మణికంఠ, యెండపల్లి జెస్సీ సుదర్శన్‌లను నిందితులుగా గుర్తించారు. వీరిలో ఒకరు హెటెరో మాజీ ఉద్యోగి. అతడు ఇచ్చిన సమాచారం మేరకు యూఎస్ఎఫ్డీఏ బృందం తనిఖీలకు సైతం వచ్చిందని పోలీసులు తెలిపారు. నిందితులిద్దరూ సిగ్నల్ యాప్ ద్వారా సంప్రదింపులు జరిపినట్లు దర్యాప్తులో బయటపడింది.